మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సాయుధ పోరాటానికి తెరదించుతూ.. పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ సభ్యులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో చేరారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 42 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ లొంగుబాటులో అత్యంత ప్రధానమైన వ్యక్తి పీఎల్‌జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు (Keshalu). బెటాలియన్ కమాండర్ దేవన్న ఇప్పటికే లొంగిపోవడంతో, కేశాలు నేతృత్వంలో కొనసాగుతున్న ఈ బృందం తాజాగా పోలీసులకు లొంగిపోయింది. వీరితో పాటు డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.
ఆయుధాల అప్పగింత..
లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట తెచ్చిన సుమారు 40 అత్యాధునిక ఆయుధాలను (AK-47, INSAS, SLR వంటివి) డీజీపీకి అప్పగించారు. లొంగిపోయిన 42 మందిలో 41 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, తెలంగాణకు చెందిన వారు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల భద్రతా బలగాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో, తెలంగాణ సురక్షితమైన ప్రాంతంగా భావించి తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు మావోయిస్టులు తెలిపారు.
తెలంగాణ ఇక “మావోయిస్టు రహిత” రాష్ట్రం!
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. “ఈ భారీ లొంగుబాటుతో తెలంగాణలో పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిస్థాయిలో కనుమరుగైంది. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరు. దీనితో తెలంగాణ ఇప్పుడు పూర్తిస్థాయిలో ‘మావోయిస్టు రహిత’ రాష్ట్రంగా అవతరించిందని గర్వంగా ప్రకటిస్తున్నాను.” అని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


